Apple Watch: మరోసారి ప్రాణం కాపాడిన ఆపిల్ వాచ్
- ఆసుపత్రి ఈసీజీ తప్పని తేల్చిన ఆపిల్ వాచ్
- వృద్ధురాలికి ముప్పు ఉందన్న విషయం వెల్లడించిన వాచ్
- ఆపిల్ వాచ్ ఈసీజీ కరెక్టేనన్న వైద్యులు
ఐటీ, ఎలక్ట్రానిక్ దిగ్గజం ఆపిల్ ప్రజల ఆరోగ్య అవసరాలను, శారీరక స్థితిని సైతం గుర్తించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక వాచ్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆపిల్ వాచ్ లో నిక్షిప్తం చేసిన ఈసీజీ సదుపాయంతో యూజర్ హృదయస్పందన కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే పలువురి ప్రాణాలు కాపాడిన సంఘటనలు మీడియాలో వచ్చాయి. తాజాగా, 80 ఏళ్ల వృద్ధురాలికి పొంచివున్న ముప్పును ఆపిల్ వాచ్ హెచ్చరించింది. తద్వారా వైద్యులు సకాలంలో స్పందించి ఆమెకు చికిత్స అందించి ప్రాణం పోశారు.
ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, ఆ వృద్ధురాలు ఆసుపత్రికి వెళ్లగా, ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడి ఈసీజీ రిపోర్టుల్లో పేర్కొన్నారు. కానీ ఆపిల్ వాచ్ మాత్రం, కరోనా ఇస్కేమియా తీవ్రస్థాయిలో ఉన్న విషయాన్ని గుర్తించి అలర్ట్ చేసింది. దాంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు మరిన్ని పరీక్షలు చేసి, ఆపిల్ వాచ్ హెచ్చరికలు నిజమేనని నిర్ధారించారు. కాగా, త్వరలోనే ఆపిల్ నుంచి 6 సిరీస్ వాచ్ లు మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో కరోనా కారణంగా కలిగే నెమ్మును గుర్తించే పల్స్ ఆక్సీమీటర్ ఫీచర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.