TTD: తిరుమల దర్శనాలు ప్రారంభమైనా సర్వదర్శనం నిలిపివేత... కీలక నిర్ణయం తీసుకోనున్న టీటీడీ!
- ఆన్ లైన్, టైమ్ స్లాట్ టోకెన్లకు మాత్రమే అనుమతి
- భక్తుల సంఖ్యను 25 వేలకు పరిమితం చేసే యోచన
- ఈ వారంలో కీలక నిర్ణయం తీసుకోనున్న టీటీడీ
నిత్యమూ లక్షలాది మంది క్షణకాలం పాటు శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం, గంటల తరబడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి చూస్తూ ఉండే పరిస్థితులు ఇప్పట్లో కనిపించవేమో. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా భక్తులకు స్వామి దర్శనం దూరం కాగా, లాక్ డౌన్ ముగిసిన తరువాత దర్శనాలను పునరుద్ధరించే విషయంలో టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి తిరుమలలో జరుగకుండా చూడటమే లక్ష్యంగా కొన్ని కొత్త చర్యలను ప్రకటించనున్నట్టు సమాచారం.
ముఖ్యంగా కరోనా ముప్పు తగ్గేంతవరకూ స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యపై పరిమితులను విధించాలని టీటీడీ యోచిస్తోంది. కేవలం ఆన్ లైన్ ద్వారా టికెట్లను విక్రయించడం, తిరుపతికి వచ్చే వారికి టైమ్ స్లాట్ టోకెన్లు ఇచ్చి, వారిని కొండపైకి పంపించి దర్శనం చేయించడం ప్రారంభించాలని భావిస్తోంది. కొంతకాలం పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు అనుమతిని నిరాకరించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. మరో వారంలో నూతన దర్శన విధానంపై ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.
కాగా, సాధారణ రోజుల్లో 60 వేల నుంచి 80 వేల మంది వరకూ, శని, ఆది వారాలు, పండగ రోజుల్లో 90 వేల నుంచి లక్ష మంది వరకూ స్వామి దర్శనానికి వస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆలయాన్ని తిరిగి తెరచినా, కరోనా భయం పూర్తిగా తొలగేంత వరకూ భక్తుల సంఖ్యను 25 వేలకు పరిమితం చేయాలని టీటీడీ భావిస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ, భక్తులను దర్శనాలకు అనుమతించాలంటే, అంతకుమించి సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం.