Home Ministry: వేర్వేరు రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై కేంద్ర హోమ్ శాఖ తాజా ఆదేశాలు!
- వలస కార్మికులు, విద్యార్థులకు మాత్రమే ప్రయాణ అనుమతి
- యాత్రికులు, పర్యాటకుల తరలింపునకూ ఏర్పాట్లు
- సాధారణ ప్రజలను వెళ్లనివ్వబోమన్న కేంద్రం
రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతించే విషయమై గతంలో ఇచ్చిన నిబంధనల సడలింపుపై కేంద్ర హోమ్ శాఖ వివరణ ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన వలస కార్మికులు, టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థులు మాత్రమే ప్రస్తుతానికి ప్రయాణం చేసేందుకు అర్హులని స్పష్టం చేసింది. సాధారణ ప్రజల ప్రయాణాలకు అనుమతి లేదని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారాన్ని పంపామని హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు.
తమ స్వస్థలాల నుంచి లాక్ డౌన్ కు ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని, లాక్ డౌన్ కు రోజుల ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాహనాలు కూడా స్వస్థలాలకు చేరవచ్చని అజయ్ భల్లా తెలిపారు. ఉద్యోగార్థం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. సాధారణ కార్యకలాపాలు, వేడుకలు, విందులకు స్వస్థలాలకు వెళ్లేందుకూ అనుమతి లేదని స్పష్టం చేశారు.
కాగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల తరలింపు గత వారంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీరి తరలింపునకు ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేయగా, ఎంతో మంది సాధారణ ప్రజలు రైల్వే స్టేషన్లకు పరుగులు తీశారు. వీరందరినీ అడ్డుకునేందుకు పోలీసులు, అధికారులు నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హూమ్ శాఖ క్లారిటీ ఇచ్చింది.