UK: పులిని పట్టుకోవడం కోసం.. ఆయుధాలతో హెలికాప్టర్ లో వచ్చిన పోలీసులు అవాక్కయిన వేళ...!
- యూకేలోని కెంట్ లో ఘటన
- పొదల్లో పులి ఉందంటూ పోలీసులకు సమాచారం
- తీరా వచ్చి చూస్తే అది పులి విగ్రహం
హఠాత్తుగా ఓ పులి కనిపించడంతో మార్నింగ్ వాకింగ్ చేస్తున్నవారు బెంబేలెత్తిపోయారు. అక్కడి నుంచి వాయువేగంతో బయటపడి... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షణాల మీద అక్కడకు చేరుకున్న పోలీసులు షాక్ కు గురయ్యారు. అది అసలైన పులి కాకపోవడంతో తమలో తాము నవ్వుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన యూకేలోని కెంట్ నగర ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, శనివారం ఉదయం పొదల్లో పులి ఉందని ఉదయం వాకింగ్ చేస్తున్న వ్యక్తుల్లో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆయుధాలతో పాటు పోలీసు టీమ్ అక్కడకు హెలికాప్టర్ లో చేరుకుంది. వారు చాలా జాగ్రత్తగా దాన్ని గమనిస్తూ దగ్గరకు వెళ్లి చూస్తే అది నిజమైన పులి కాదని తేలింది. అది పులి విగ్రహం మాత్రమే. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు, ఈ పులి విగ్రహాన్ని రెండు దశాబ్దాల క్రితం 85 ఏళ్ల బామ్మ జూలియట్ సింప్సన్ తయారు చేసింది. ఇంటి దగ్గర పొదల్లో దాన్ని ఉంచింది. పోలీసులు పులి కోసం వచ్చిన విషయాన్ని తెలుసుకున్న జూలియట్ అక్కడకు వెళ్లింది.
ఆ తర్వాత ఆమె బీబీసీతో మాట్లాడుతూ, అది నిజమైన పులి కాదని తెలుసుకున్న పోలీసులతో... తన ఒరిజినల్ చిరుతను చూపించమంటారా? అని ప్రశ్నించానని చమత్కరించారు. తమ నాయనమ్మ మంచి శిల్పి అని చెబుతూ, ఆమె చెక్కిన ఆ పులి విగ్రహానికి సంబంధించిన ఫొటోలను ఆమె మనవరాలు ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.