Bandla Ganesh: 'ప్రేమతో మీ బండ్ల గణేశ్' అంటూనే.. నారా లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేసిన వైనం!
- వరుస ట్వీట్లు చేసిన బండ్ల గణేశ్
- వారసత్వం కాదు దమ్ముండాలంటూ వ్యాఖ్యలు
- చంద్రబాబు కుమారుడిగా తప్ప ఏం అర్హత ఉందని విమర్శలు
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై వరుస ట్వీట్లు చేశారు. "గౌరనీయులైన నారా లోకేశ్ గారికి ప్రేమతో..." అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు. నారా లోకేశ్... రాజకీయాల్లో వారసత్వం కాదు, దమ్ము, ధైర్యం, పోరాడతాడన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం ముఖ్యమని, ఇవే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అని వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో కొద్దిమందికే దక్కే అదృష్టం మీకు దక్కింది, చంద్రబాబునాయుడి కుమారుడిగా పుట్టడమే ఆ అదృష్టమని పేర్కొన్నారు.
నారా లోకేశ్... రాజకీయ పార్టీ అంటే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కాదు, మన పార్టీలో ఉండే నాయకులు అంటే మనవద్ద పనిచేసే ఉద్యోగులు కాదు, ప్రతి ఒక్కరినీ ప్రేమించి, ప్రేమను పంచి మనలో ఒకరిగా చేసుకుని ప్రజలకు సేవ చేయాలి అని వివరించారు.
"మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే... మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలి. ఆ విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అద్భుతంగా పనిచేయడం ద్వారా నారా లోకేశ్ తండ్రి చంద్రబాబునాయుడు అని చెప్పుకునేలా చేయాలి. మీరెలా ఉండాలంటే.... సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ లా ఉండాలి. తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్థులు అందరూ ఒక్కటై అణచివేయాలని చూసినా అందరినీ ఎదిరించి తొమ్మిదేళ్లు పోరాడి ఘనవిజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డిలా ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ లా తండ్రికి పోటీ ఇచ్చే కొడుకులా ఉండాలి. ఎవరూ, ఎలాంటి సపోర్ట్ చేయకపోయినా నంబర్ వన్ స్థాయికి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లా ఉండాలి.
కానీ మిమ్మల్ని చూస్తే నాకు భయమేస్తోంది. రాజకీయాల్లో పట్టు సాధించలేరేమోననిపిస్తోంది. చంద్రబాబునాయుడు కుమారుడిగా తప్ప రాజకీయంగా మీకు ఏ అర్హత లేదు. నాకు తెలిసి మీరు రాజకీయంగా విఫలమైన నాయకుడు. ఈ మధ్య మీరు ట్విట్టర్ లో చేస్తున్న కామెంట్లతో మిమ్మల్ని ఇష్టపడే అనేకమంది బాధపడుతున్నారు. మొన్నీమధ్య తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వస్తే మీరు చేసిన ట్వీట్ మీ దిగజారుడుతనాన్ని సూచిస్తోంది. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకపోయినా, మీరన్నా, మీ నాన్నగారన్నా, మీ తాతగారన్నా గౌరవం, ప్రేమ కాబట్టే ఈ విన్నపం చేస్తున్నా... ప్రేమతో మీ బండ్ల గణేశ్" అంటూ ట్వీట్లు చేశారు.