Telangana: నాకు ఇష్టం లేదు... అయినా తప్పడం లేదు: మద్యం షాపుల ప్రారంభంపై కారణం చెప్పిన కేసీఆర్
- తెలంగాణతో నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు
- ఆ నాలుగు రాష్ట్రాల్లో షాపులు తెరిచారు
- మనం తెరవకుంటే స్మగ్లింగ్ పెరుగుతుందన్న కేసీఆర్
రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా నశించకుండానే మద్యం షాపులను తిరిగి ప్రారంభించడం తనకు ఇష్టం లేదని, అయినా తప్పడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయాల మేరకు సోమవారం నుంచి తెలంగాణకు సరిహద్దులను కలిగివున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచారని గుర్తు చేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్ తో 890 కిలోమీటర్లు, మహారాష్ట్రతో సుమారు 700 కిలోమీటర్లు, కర్ణాటకతో 496 కిలోమీటర్లు, చత్తీస్ గఢ్ తో 235 కిలోమీటర్ల బార్డర్ ఉందని అన్నారు. ఈ సమయంలో తెలంగాణలో షాపులను తెరవకుంటే, లిక్కర్ స్మగ్లింగ్ పెరిగిపోతుందని, సరిహద్దు గ్రామాల ప్రజలు నిన్న, ఇవాళే హద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వచ్చారని, ఈ కారణంతో కరోనా వైరస్ మహమ్మారి తిరిగి వ్యాపించకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మద్యం తయారు చేసే డిస్టిలరీల నుంచి కూడా ఒత్తిడి పెరిగిందని, దేశమంతా దుకాణాలు తెరిచి, మద్యం తయారీ కేంద్రాలు నడుస్తుంటే, తెలంగాణలో తాము నష్టపోతామని, తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని అంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడేసరికి రాష్ట్రంలో గుడుంబా రాజ్యమేలుతోందని, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఎంతో శ్రమించి, తెలంగాణ రాష్ట్రాన్ని గుండుంబా రహితంగా మార్చేందుకు కృషి చేశారని తెలిపారు. గుడుంబాపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయాలను చూపించి, వారిని మార్చామని, కానీ గత 45 రోజులుగా గుడుంబా తయారీ కేంద్రాలు వెలిశాయని, తిరిగి రాష్ట్రంలో గుడుంబా కనిపించకుండా చేస్తామని తెలిపారు. వైన్స్ షాపులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తెరచేవుంటాయని, కస్టమర్లు హడావుడి లేకుండా కొనుక్కోవచ్చని సూచించారు.