India: విస్తరిస్తున్న మహమ్మారి... కేసుల సంఖ్యలో 15వ స్థానానికి ఇండియా!

New Corona Cases Record in India

  • నిన్న ఒక్కరోజులో 3,875 కేసులు
  • సోమవారంతో పోలిస్తే 9.04 శాతం పెరిగిన కొత్త కేసులు
  • 194 మంది కన్నుమూత
  • గణనీయంగా పెరిగిన రికవరీల సంఖ్య

ఇండియాలో కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. నిన్న మంగళవారం ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 3,875 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇన్ని కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో కేసుల సంఖ్య విషయంలో ఇండియా ప్రపంచ దేశాల జాబితాలో 15వ స్థానానికి చేరింది. సోమవారంతో పోలిస్తే 9.04 శాతం కేసులు పెరిగాయి. ఇదే సమయంలో 194 మంది కరోనా కారణంగా మరణించారు.

గత నెల 20 నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ రాగా, ఆ తరువాత అత్యధిక శాతం కేసులు మంగళవారం నాడే వచ్చాయి. ఇక్కడ కాస్తంత ఆశాజనకంగా కనిపిస్తున్నది ఏంటంటే, మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరగడం. సోమవారం నాడు 27.45 శాతంగా ఉన్న రికవరీల సంఖ్య, మంగళవారానికి 28.17 శాతానికి చేరింది. కొత్త కేసుల్లో 72 శాతం... అంటే 1,567 కేసులు మహారాష్ట్రలోనే నమోదు కాగా, తమిళనాడులో 527, గుజరాత్ లో 376, న్యూఢిల్లీలో 349, పశ్చిమ బెంగాల్ లో 296 కేసులు వచ్చాయి. మిగతా రాష్ట్రాల్లో నమోదైన కేసులు నామమాత్రమే.

ఇక ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే, మంగళవారం నాడు 50,800 కొత్త కేసులు రాగా, మొత్తం 36,94,071 కేసులు నమోదైనట్లయింది. మొత్తం 2,55,596 మంది మరణించారు. ఇండియా విషయానికి వస్తే, మొత్తం కేసులు 46,711కు చేరగా, 1,583 మంది మరణించారు.

  • Loading...

More Telugu News