Visakhapatnam District: విశాఖ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా.. వివరాలు అడిగి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి
- బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కిషన్ రెడ్డి
- సీఎస్, డీజీపీలకు ఫోన్
- హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో మాట్లాడిన వెంకయ్య
విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్లతో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు.
బాధితులకు మరింత మెరుగైన చికిత్స అందించాలని, విశాఖకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలను పంపాలని కిషన్రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాల్సిందిగా కోరినట్టు వరుస ట్వీట్లలో తెలిపారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ ఘటనపై స్పందించారు. హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో మాట్లాడి ఆరా తీశారు. ఈ సందర్భంగా అజయ్ భల్లా మాట్లాడుతూ.. విశాఖకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పంపినట్టు చెప్పారు.