Kerala: వరుసగా రెండోరోజూ కేరళలో కరోనా కేసులు నిల్
- కేరళలో తగ్గుముఖం పడుతున్న కరోనా
- సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు
- మొదటి నుంచి సమర్థంగా వ్యవహరించిన కేరళ
దేశంలో కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో కాస్తంత కుదుపులకు లోనైన కేరళ ఆపై అద్భుతంగా స్పందించింది. వైరస్ మహమ్మారిని సమర్థంగా కట్టడి చేస్తూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా, కేరళలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు నమోదు కాలేదు. నిన్న, ఇవాళ కొత్త కేసుల సంఖ్య సున్నా కావడం అక్కడి ప్రభుత్వ, అధికార యంత్రాంగం దృఢ సంకల్పానికి నిదర్శనం.
ఇక కేరళలో ఇప్పటివరకు 500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు. అయితే, కేంద్రం విదేశాల నుంచి భారతీయులను తీసుకువస్తున్న క్రమంలో, కేరళీయులు కూడా స్వరాష్ట్రానికి రానున్నారు. వారికి కూడా కచ్చితమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, రాష్ట్రాన్ని కరోనా రహితంగా తీర్చిదిద్దాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది.