Devineni Uma: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్ గారూ: గ్యాస్ లీక్ దుర్ఘటనపై దేవినేని ఉమ
- ఎల్జీ పాలిమర్స్ కి అనుమతులు ఇప్పించిన పెద్దలు ఎవరు?
- ప్రజల్ని పరుగులు పెట్టించిన కంపెనీ మంచిది ఎలా అవుతుంది?
- కేంద్రాన్ని ఉన్నత స్థాయి విచారణ కోసం మీరు అడుగుతారా?
- ప్రజలని అడగమంటారా? చెప్పండి
విశాఖపట్నం సమీపంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీక్ జరిగి, 12 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ సీఎం జగన్‌కు పలు ప్రశ్నలు సంధించారు.
'లాక్ డౌన్ సమయంలో ఎల్జీ పాలిమర్స్ కి అనుమతులు ఇప్పించిన పెద్దలు ఎవరు? ప్రాణాంతకమైన విషవాయువు వదిలి, పుట్టిన ప్రాంతం నుంచి ప్రజల్ని పరుగులు పెట్టించిన కంపెనీ మంచిది ఎలా అవుతుంది? కేంద్రాన్ని ఉన్నత స్థాయి విచారణ మీరు అడుగుతారా? ప్రజలని అడగమంటారా? చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
ఎల్జీ పాలిమర్స్‌పై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ? అంటూ కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రశ్నించిన విషయాన్ని తెలుపుతూ ప్రచురించిన ఓ వార్తా పత్రిక కథానాన్ని ఈ సందర్భంగా దేవినేని ఉమ పోస్ట్ చేశారు. విశాఖలో పెను విషాదానికి కారణం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యమేనని, అది కాలుష్యకారక పరిశ్రమని తెలిసీ దాని విస్తరణతో పాటు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించేందుకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, పారిశ్రామిక భద్రతా విభాగం అధికారులు అనుమతులు ఇచ్చారని, వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్‌కు ఆ విశ్రాంత అధికారి నిన్న లేఖ రాశారు.