SBI: 45 నిమిషాల్లో రూ.5 లక్షల వరకు లోన్... ఎస్ బీఐ కొత్త స్కీమ్
- లాక్ డౌన్ నేపథ్యంలో సులభతరమైన లోన్
- రుణమొత్తంపై 10.5 శాతం వడ్డీరేటు
- ఎస్ బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) 'ఎమర్జెన్సీ లోన్ స్కీమ్' పేరిట సరికొత్త విధానం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణ మొత్తంపై 10.5 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. అంతేకాదు, నెలసరి చెల్లింపులు కూడా ఆర్నెల్ల తర్వాత ప్రారంభమవుతాయి. అంటే లోన్ తీసుకున్న ఆర్నెల్ల అనంతరం మొదటి ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
కరోనా లాక్ డౌన్ కష్టాల నేపథ్యంలో ఈ విధానం ఖాతాదారులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని ఎస్ బీఐ వర్గాలంటున్నాయి. ఈ స్కీమ్ ద్వారా రుణం పొందేందుకు ఎస్ బీఐ యోనో యాప్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి PAPL అని టైప్ చేసి, మీ బ్యాంకు ఖాతా నంబరులోని చివరి నాలుగు అంకెలను కూడా జతచేసి 567676 నంబరుకు ఎస్సెమ్మెస్ చేస్తే, ఈ ఎమర్జెన్సీ లోన్ స్కీమ్ కు మీరు అర్హులో కాదో తెలిసిపోతుంది.