Migrants: మంగళగిరి ఎయిమ్స్ వద్ద వలస కార్మికుల ఆందోళన... సెక్యూరిటీ గది ధ్వంసం
- స్వరాష్ట్రాలకు పంపించాలంటున్న కార్మికులు
- మంగళగిరి ఎయిమ్స్ వద్దకు 3 వేల మంది కార్మికుల రాక
- పోలీసులపైనా రాళ్లు రువ్విన వైనం
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమను కూడా స్వరాష్ట్రాలకు పంపించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు 3,000 మంది వరకు కార్మికులు ఒక్కసారిగా ఎయిమ్స్ వద్దకు రావడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. అన్ని రాష్ట్రాల్లోనూ వలస కార్మికులను స్వస్థలాలకు తరలిస్తున్నారని, తమను కూడా అలాగే తరలించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఎయిమ్స్ ఆవరణలోని సెక్యూరిటీ గదిని కూడా ధ్వంసం చేశారు. పోలీసులు రావడంతో వారిపైనా రాళ్లు విసిరారు.
మంగళగిరి అదనపు ఎస్పీ ఈశ్వర్ రావు వలస కార్మికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లా రెడ్ జోన్ లో ఉందని, అందుకే ఈ జిల్లా నుంచి ఎవరినీ తరలించేందుకు ఇతర రాష్ట్రాలు అంగీకరించడం లేదని వివరించారు. నెలన్నర రోజులకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎలాగైనా తమను స్వరాష్ట్రాలకు పంపించాలని వారు విజ్ఞప్తి చేశారు.