Atchannaidu: జగన్‌ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఎల్జీ పాలిమర్స్‌ ప్రతినిధులు కలిశారు: అచ్చెన్నాయుడు

atchannaidu fires on jagan

  • ముఖ్యమంత్రి పర్యటనలో కొంత తేడా కనపడింది
  • దీనిపై అభ్యంతరాలున్నాయి
  • మృతులకు జగన్ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారు
  • రూ.కోటి ప్రభుత్వం ఇస్తుందా?  లేక కంపెనీ యాజమాన్యం ఇస్తుందా?  

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటనపై ఏపీ ప్రభుత్వం  స్పందిస్తోన్న తీరుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు, తదితర నేతలతో కలిసి అచ్చెన్నాయుడు పరామర్శించారు.

అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పర్యటనలో కొంత తేడా కనపడింది. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయన దిగిన వెంటనే ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రతినిధులు కలిశారు. దీనిపై అభ్యంతరాలున్నాయి. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది' అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రమాదం జరిగిన వెంటనే సీఎం విశాఖకు రావడంతో ప్రజలకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, ఆయన పర్యటన జరిగిన తీరు చూస్తే బాధ కలిగిందని ఆయన చెప్పారు. గ్యాస్‌ లీక్‌ బాధితులను కలిసి పరామర్శించకముందే పరిశ్రమ ప్రతినిధులను ఆయన కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు అధిక పరిహారం ప్రకటించడం సంతోషకరమైన విషయమేనని చెప్పారు. అయితే, ఆ పరిహారం ఎవరు ఇస్తారని ప్రశ్నించారు.

మృతులకు జగన్ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారని, అయితే, ఆ రూ.కోటి ప్రభుత్వం ఇస్తుందా?  లేక కంపెనీ యాజమాన్యం ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఒకవేళ  కంపెనీ ఈ పరిహారాన్ని ఇస్తే ఇంతకు పదిరెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గ్యాస్‌ లీక్‌ తర్వాత పరిశ్రమను విశాఖ నుంచి తరలిస్తామని సీఎం ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురై మృతదేహాలతో నిరసన తెలుపుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News