Pawan Kalyan: ప్రభుత్వం ప్రకటిస్తున్న కేసుల కంటే ఎక్కువే ఉండచ్చు: పవన్ కల్యాణ్
- కరోనా వైరస్ దేశానికీ, దేశానికీ రూపం మార్చుకుంటోంది
- అందువల్ల ఒకే వ్యాక్సిన్ తో వైరస్ కట్టడి కాకపోవచ్చు
- చేతి వృత్తుల వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలి
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులను అధికారికంగా ప్రకటిస్తున్న వాటికంటే ఎక్కువే ఉండచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తమిళనాడులో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని... అందుకే ఆ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయని... అయితే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
కరోనా వైరస్ దేశానికీ, దేశానికీ రూపం మార్చుకుంటోందని... అందువల్ల ఒకే వ్యాక్సిన్ తో వైరస్ కట్టడి కాకపోవచ్చని.. వైరస్ రూపానికి తగ్గట్టు వ్యాక్సిన్లను తీసుకురావాల్సి ఉంటుందని పవన్ చెప్పారు. కరోనా వల్ల పలు రంగాలు నష్టపోతున్నాయని... వీటికి అండగా ఉండాలని అన్నారు. చేతి వృత్తుల వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి రంగం ఏ విధంగా ప్రభావితమైందనే విషయంపై నివేదికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ సంక్లిష్ట సమయంలో ఆపదలో ఉన్నవారికి జనసేన శ్రేణులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.