Mallu Bhatti Vikramarka: మద్యం షాపులు తెరిచి ఇన్నాళ్ల శ్రమ వృథా చేశారు: భట్టి విక్రమార్క
- పోలీసు కాపలా మధ్య విక్రయిస్తున్నారంటూ విమర్శలు
- పేద ప్రజలు మరణిస్తున్నారని ఆవేదన
- అయినా మద్యంతో వచ్చే ఆదాయమే ముఖ్యమా? అంటూ ఆగ్రహం
తెలంగాణలో కూడా మద్యం అమ్మకాలు షురూ అయిన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం షాపులు తెరిచి ఇన్నాళ్ల శ్రమ వృథా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కాపలా పెట్టి మరీ మద్యం విక్రయాలు సాగిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలు మరణిస్తున్నా మద్యం వల్ల వచ్చే ఆదాయమే ముఖ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు రూ.21 వేల కోట్లతో టెండర్లు అవసరమా? అని నిలదీశారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? అంటూ భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దోపిడీని ప్రశ్నిస్తే ఇష్టంవచ్చినట్టు తిడుతున్నారని, విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
కొత్త విద్యుత్ చట్టం విధివిధానాలు వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త విద్యుత్ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా నష్టమో చెప్పాలని అన్నారు. ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ సబ్సిడీలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. సబ్సిడీలు చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. కేంద్రం ఎందుకు చట్టం తెస్తుందో, కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదంటూ భట్టి వ్యాఖ్యానించారు. అసలు, కేంద్రంతో కేసీఆర్ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదని పేర్కొన్నారు. ప్రజలకు నష్టం జరుగుతుందని భావిస్తే కాంగ్రెస్ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.