Telangana: హైదరాబాదు నుంచి వలస కూలీల తరలింపుకు సిటీ బస్సులు.. నేడు బీహార్, ఝార్ఖండ్‌కు బస్సులు పయనం
- నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరుతున్న బస్సులు
- ఒకే ప్రాంతానికి చెందిన వారు వెయ్యి మందికిపైగా ఉంటే రైలు
- నేడు బయలుదేరిన ఆరు బస్సులు
వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులతో పాటు, ఇతర పనులపై వచ్చి చిక్కుకుపోయిన వారిని సిటీ బస్సుల్లో ఆయా ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందుకోసం నగరంలోని 29 డిపోల్లో పూర్తి ఫిట్నెస్ ఉన్న బస్సులను సిద్ధం చేశారు. బస్సులను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత భౌతిక దూరం నిబంధనల ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లను నియమించారు. నగరంలో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు మొత్తం 600 బస్సులను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.
తమ పరిధిలో ఉన్న వలస కార్మికుల వివరాలను ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదు చేస్తున్నారు. దీంతో వారి సంఖ్యను బట్టి బస్సులు నడుపుతున్నారు. టికెట్ భరించే శక్తి ఉన్నవారికి వెంటనే బస్సులను ఏర్పాటు చేస్తుండగా, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వమే ఉచితంగా తరలిస్తోంది.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కేరళకు నాలుగు బస్సులు వెళ్లగా, తాజాగా ఈ రోజు బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరు బస్సులు బయలుదేరాయి. అయితే, ఒకే ప్రాంతానికి చెందిన వారు కనుక వెయ్యిమందికిపైగా ఉంటే రైలును సమకూరుస్తున్న ప్రభుత్వం, ఆలోపు ఉంటే మాత్రం బస్సుల్లో తరలిస్తోంది.