TTD: తిరుమల వెంకన్నకూ తప్పని జీతం కష్టాలు!
- లాక్ డౌన్ కారణంగా తిరుమల ఆలయం మూసివేత
- ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు సతమతమవుతున్న టీటీడీ
- జీతాలు, పెన్షన్ల కోసం ఇప్పటికే రూ.300 కోట్ల చెల్లింపు
ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవస్థానంగా తిరుమల పుణ్యక్షేత్రంకు ఓ గుర్తింపు ఉంది. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇప్పుడు తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో తిరుమల ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు ఆలయానికి రూ.400 కోట్ల రాబడి తగ్గినట్టు అంచనా వేశారు.
ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, ఇతర ఖర్చుల నిమిత్తం ఇప్పటికే రూ.300 కోట్లు ఖర్చు చేశామని, అయితే, బ్యాంకుల్లో శ్రీవారి పేరిట ఉన్న 8 టన్నుల బంగారం, రూ.14 వేల కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల జోలికి వెళ్లకుండా ప్రస్తుత సమస్య నుంచి గట్టెక్కడం ఎలాగన్నదాని గురించి ఆలోచిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నా జీతాలు, పెన్షన్లు, ఇతర తప్పనిసరి ఖర్చులు చెల్లించడం తమ విధి అని అభిప్రాయపడ్డారు. వివిధ విభాగాల కింద టీటీడీ ఖర్చు ప్రతి ఏడాది రూ.2,500 కోట్లు ఉంటుందని వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో తిరుమల క్షేత్రానికి ప్రతి నెలా సగటున రూ.200 కోట్ల నుంచి రూ.220 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని, లాక్ డౌన్ కారణంగా ఇప్పుడా ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోందని వివరించారు.