Corona Virus: కరోనా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్న 100 గ్రూపులు.. ప్రధాన పోటీ ఈ నాలుగు వ్యాక్సిన్ల మధ్యే!
- కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు
- పరిశోధనల్లో మునిగిపోయిన దాదాపు 100 రీసర్చ్ గ్రూపులు
- కొనసాగుతున్న హ్యమన్ ట్రయల్స్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి, మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. దాదాపు 100 రీసర్చ్ గ్రూపులు రేయింబవళ్లు పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. వీటన్నింటిలో నాలుగు వ్యాక్సిన్లు రేసులో ముందున్నాయి.
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ: ‘ChAdOx1 nCoV-19’ అనే వ్యాక్సిన్ ను ఆక్స్ ఫర్డ్ యూనివర్విటీ డెవలప్ చేస్తోంది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన ఫేజ్-1 క్లినికల్ ట్రయల్ కొనసాగుతోంది.
మసాచుసెట్స్ - మోడర్నా వ్యాక్సిన్: అమెరికా మసాచుసెట్స్ లోని మోడర్నా అనే బయోటిక్ కంపెనీ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తో కలిసి పరిశోధనలు చేస్తోంది. 'mRNA-1273' పేరుతో పిలుస్తున్న ఈ వ్యాక్సిన్ ఫేజ్-1 ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఫేజ్-2 ట్రయల్స్ కు సిద్ధమవుతోంది.
సినోవాక్ బయోటెక్: పికోవాక్ (PiCoVacc) వ్యాక్సిన్ ను చైనా బీజింగ్ లోకి సినోవాక్ బయోటెక్ కంపెనీ సిద్ధం చేస్తోంది. వ్యాక్సిన్ ను విజయవంతంగా టెస్ట్ చేశామని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. కోతులపై వ్యాక్సిన్ ను ప్రయోగించామని... కరోనా వైరస్ నుంచి ఆ కోతులు చాలా వరకు తమను తాము రక్షించుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించి హ్యమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
ఫైజర్ మరియు బయో ఎన్ టెక్ వ్యాక్సిన్: అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఫైజర్ జర్మనీకి చెందిన తన పార్ట్ నర్ బయో ఎన్ టెక్ తో కలిసి 'BNT162' వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్స్ ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్నాయి.
ఈ వ్యాక్సిన్లలో ఏది విజయవంతంగా ట్రయల్స్ ను పూర్తి చేసుకుని... ప్రజలకు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.