Cheruku Sudhakar: తెలంగాణపై కేంద్ర మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు: చెరుకు సుధాకర్
- కరోనా టెస్టులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు
- ఈ విషయంపై చర్చకు ఈటల సిద్ధమేనా?
- కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతున్నా.. మౌనంగా ఉంటున్నారు
కృష్ణా నది నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా... టీఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉంటోందని... ఇది మంచిది కాదని తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అసంతృప్తిని వ్యక్తం చేశారని... దీనిపై టీఎస్ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పందించాలని అన్నారు.
ఒకవేళ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం టెస్టులను నిర్వహిస్తున్నట్టైతే... ఆ మార్గదర్శకాలు ఏమిటో ప్రజల ముందు ఉంచాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుని ఉంటే... ఈ విషయంలో బహింరంగ చర్చకు ఈటల సిద్దమేనా? అని సవాల్ విసిరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల ఉద్యోగాలను ప్రమాదంలో పడేసిన జీవోపై సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం వాదనలను బలంగా వినిపించలేకపోయిందని విమర్శించారు. తక్షణమే సుప్రీంలో మరో పిటిషన్ వేయాలని చెప్పారు.