Suryapet District: నన్ను డిశ్చార్జ్ చేస్తారా? లేదా?.. గాంధీ ఆసుపత్రిలో వైద్యులతో గొడవపడిన కోవిడ్ బాధితుడు
- 15 రోజుల క్రితం వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు
- నెగటివ్ రిపోర్టులు వచ్చినా ఇంటికి పంపడం లేదు
- సూర్యాపేట బాధితుడి ఆవేదన
15 రోజుల క్రితం వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తున్న డాక్టర్లు, తాను వచ్చి నెల రోజులైనా తనను మాత్రం ఇంటికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి హల్‌చల్ చేశాడు. సూర్యాపేటకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారినపడి నెల రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చేరాడు. 14 రోజులపాటు చికిత్స అందించిన తర్వాత పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినప్పటికీ అతడిని డిశ్చార్జ్ చేయలేదు.
దీంతో నెల రోజులుగా తనను ఆసుపత్రిలోనే ఉంచడంపై అసహనం వ్యక్తం చేసిన బాధితుడు తనను డిశ్చార్జ్ చేయాలంటూ వైద్యులు, సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. రెండు వారాల క్రితం వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నారని, కానీ తానొచ్చి నెల రోజులైనా పంపడం లేదని వారితో గొడవపెట్టుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అతడిని సముదాయించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పడంతో అతడు వెనక్కి తగ్గాడు.