China: సరిహద్దుల్లో భారత సైన్యంతో గొడవపై స్పందించిన చైనా!
- శనివారం నాడు దూకుడుగా వ్యవహరించిన చైనా సైనికులు
- నిరాధార ఆరోపణలేనని కొట్టి పారేసిన చైనా విదేశాంగ శాఖ
- సరిహద్దుల్లో శాంతికి ఇరు దేశాలూ కృషి చేయాలని వెల్లడి
ఉత్తర సిక్కింలోని సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, ఇరుపక్షాలు బాహాబాహీకి దిగడంపై చైనా ఆచితూచి స్పందించింది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజ్జియన్, బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ, సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని తమ సైన్యానికి సూచించామన్నారు.
"మా సరిహద్దుల్లో పహారాలో ఉండే సైన్యం శాంతినే కోరుకుంటుంది. సరిహద్దుల నిర్వహణలో చైనా, భారత్ లు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ విషయంలో గతంలో అవలంబించిన విధానాలనే కొనసాగించాలి. ఇరు దేశాలూ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి, పరిస్థితులను చక్కదిద్దేందుకు పాటుపడాలి" అని ఆయన అన్నారు.
కాగా, శనివారం నాడు భారత్, చైనా సరిహద్దుల వద్ద రాళ్లదాడి, ఆపై సైనికులు పరస్పరం బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. మొత్తం ఘటనను భారత సైన్యం వీడియో తీసింది. చైనా సైనికులు దురుసుగా ప్రవర్తించి, ముష్టిఘాతాలకు దిగినట్టు ఈ వీడియోలో కనిపించగా, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని జావో కొట్టిపారేశారు. "చైనా, భారత్ లు గడచిన 70 ఏళ్లుగా ద్వైపాక్షిక బంధాలను కొనసాగిస్తున్నాయి. కొవిడ్-19పై పోరాటంలోనూ చేతులు కలిపాయి. ఈ తరహా ఘటనలు జరుగకుండా చూసేందుకు రెండు దేశాలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. సరిహద్దుల్లో శాంతి కొనసాగించడం మా లక్ష్యం" అని అన్నారు.