Harish Rao: తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్టే: ఏపీ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
- కొత్త ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ
- ఏపీది ఏకపక్ష నిర్ణయమన్న హరీశ్ రావు
- చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదని మండిపాటు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా పని చేస్తున్నారని అందరూ అనుకుంటున్న తరుణంలో... ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం ప్రారంభమైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త సమస్యకు కారణమైంది. పోతిరెడ్డిపాడు నుంచి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు రోజుకు 3 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో విడుదల చేసింది. రూ. 6,829 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీది ఏకపక్ష నిర్ణయమని... దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.
ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు కూడా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని అన్నారు. 805 లెవెల్ లో లిఫ్ట్ పెడుతున్నారంటే తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపెక్స్ కమిటీ అనుమతి కూడా లేకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం చెపుతున్నదానికి, చేస్తున్నదానికి తేడా ఉందని అన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని... ఏపీలో ఒక మాట, తెలంగాణలో మరోమాట మాట్లాడుతోందని మండిపడ్డారు.