Donald Trump: చైనా పట్ల ఆసియన్ అమెరికన్లు మండిపడుతున్నారు: ట్రంప్
- చైనానే వైరస్ వ్యాప్తికి కారణం అంటూ ఆరోపణలు
- చైనా పట్ల అభిప్రాయం మార్చుకోని అమెరికా అధ్యక్షుడు
- చైనీస్ అమెరికన్లు కూడా చైనా పట్ల రగిలిపోతున్నారంటూ ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పట్ల తన అక్కసు ఇంకా వెళ్లగక్కుతూనే ఉన్నారు. అమెరికా పట్ల, తక్కిన ప్రపంచం పట్ల చైనా చేసిన నిర్వాకానికి ఆసియన్ అమెరికన్లు చాలా కోపంగా ఉన్నారని ట్రంప్ ట్వీట్ చేశారు. చైనీస్ అమెరికన్లు సైతం ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారిని తాను నిందించలేనని పేర్కొన్నారు.
కరోనా వైరస్ తో కుదేలైన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికానే ప్రథమ స్థానంలో ఉంది. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తొలినాళ్లలో నిబ్బరంగానే కనిపించిన ట్రంప్, ఆ తర్వాత కేసుల సంఖ్య జెట్ స్పీడ్ అందుకోవడంతో స్వరం మార్చారు. చైనానే ఈ వైరస్ వ్యాప్తికి కారణమని, అది ప్రయోగశాలలో పుట్టిన వైరస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆయన తన వాదనకే కట్టుబడి ఉండడం చైనాను ఆగ్రహానికి గురిచేస్తోంది.
అమెరికా వాదనకు దీటుగా చైనా కొత్త బాణీ ప్రారంభించింది. అమెరికానే కరోనా వైరస్ ను వ్యాపింప చేసిందని, కరోనా ఉనికి వెల్లడయ్యాక అమెరికాలోని వైరస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో ప్రపంచానికి చెప్పాలని అమెరికాను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది.