Ayyanna Patrudu: ‘ఎల్జీ పాలిమర్స్’ స్థలంపై విజయసాయిరెడ్డి కన్నేశారు: అయ్యన్నపాత్రుడు ఆరోపణ
- పరిశ్రమను విజయనగరానికి తరలించేందుకు రంగం సిద్ధం
- 1000 ఎకరాల స్థలం కాజేసే యత్నం
- పరిశ్రమ స్థలాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేశారు. విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ స్థలంపై విజయసాయిరెడ్డి కన్నేశారని, ఆ పరిశ్రమను విజయనగరం జిల్లాకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు.
అసలు ఎల్జీ పరిశ్రమ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ ఏం మాట్లాడారు? అని ప్రశ్నించారు. పరిశ్రమకు చెందిన వెయ్యి ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఈ దోపిడీ యత్నాలను ప్రజలు దీటుగా ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు. పరిశ్రమ స్థలాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని పార్కుగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన విమర్శలు చేశారు. గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులకు పరిశ్రమ తరఫున నష్టపరిహారం ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను ఇస్తానని జగన్ ప్రకటించడంలో అర్థమేంటి? అని ప్రశ్నించారు. సీఎం తీరు చూస్తుంటే కడప సెటిల్ మెంట్ గుర్తొస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గ్యాస్ లీకేజ్ ఘటనపై సీరియస్ గా ఉండాల్సిందిపోయి, పరిశ్రమ యాజమాన్యంతో నవ్వుతూ మాట్లాడతారా? అని ప్రశ్నించారు. గ్యాస్ లీకేజ్ ఘటన మానవ తప్పిదమని కమిటీలు తేల్చాయి కనుక, ఘటనకు కారకులైన వారిని అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేశారు? అని ప్రశ్నించారు. గ్యాస్ లీకేజ్ పరిసర గ్రామాల్లో విషవాయు ప్రభావం తీవ్రత ఇంకా తగ్గ లేదని స్థానికులు చెబుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వమే కరోనా వైరస్ వ్యాప్తి చేసిందని, వైసీపీ నేతలే గ్రామాల్లో నాటుసారా కాయిస్తున్నారని ఆరోపించారు. లాక్ డౌన్ సమయంలో ఎవరైనా విద్యుత్ బిల్లులు పెంచుతారా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రైతులు అల్లాడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.