Kamal Haasan: ప్రధాని ప్రసంగంపై కమలహాసన్ వ్యాఖ్యలు
- లాక్ డౌన్ పరిస్థితులపై మోదీ ప్రసంగం
- ప్రధాని పేర్కొన్న రెండు అంశాలతో ఏకీభవిస్తున్నట్టు కమల్ వెల్లడి
- ఆర్థిక ప్యాకేజీని స్వాగతిస్తున్నామంటూ ట్వీట్
కరోనా కట్టడికి మరోసారి లాక్ డౌన్ తప్పదని, ఈసారి కొత్త రూల్స్ తో సరికొత్త లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రూ.20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజి ప్రకటించారు. దీనిపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ స్పందించారు.
ప్రధాని పేర్కొన్న రెండు అంశాలతో తాము కూడా ఏకీభవిస్తామని తెలిపారు. ప్రస్తుత సంక్షోభంలో పేదవాడే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్వావలంబనతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారని, వాటిని తాము కూడా అంగీకరిస్తున్నామని కమల్ ట్వీట్ చేశారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజిని కూడా స్వాగతిస్తున్నామని, అయితే, కేంద్రం ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలుపుతానంటోందని, అన్నీ బాగానే ఉన్నా అంతిమంగా దేశంలోని నిరుపేదలు ఏ మేరకు లబ్దిపొందుతారో చూడాలి అంటూ వ్యాఖ్యానించారు.