Chandrababu: ఏపీలో విద్యుత్ బిల్లులు నాలుగు రెట్లు పెంచడం దారుణం: చంద్రబాబునాయుడు
- చంద్రబాబు సమక్షంలో పొలిట్ బ్యూరో సమావేశం
- ఏపీలో మొదట్లో క్వారంటైన్ సక్రమంగా అమలు చేయలేదు
- మద్యం దుకాణాలు తెరవడం పెద్ద తప్పిదం
వచ్చే రెండు నెలలు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు. దేశంలో ‘కరోనా’ కట్టడి నిమిత్తం అమలు చేస్తున్న లాక్ డౌన్ ద్వారా మహమ్మారిని అరికట్టగలిగారని, అయితే, నిబంధనల అమలులో కొన్ని రాష్ట్రాల్లో పొరపాట్లు జరిగాయని విమర్శించారు. ఏపీలో మొదట్లో క్వారంటైన్ సక్రమంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు.
ఏపీలో విద్యుత్ బిల్లులు నాలుగు రెట్లు పెంచడం దారుణమని, ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. అలాగే, మద్యం దుకాణాలు తెరవడం పెద్ద తప్పిదమని విమర్శించారు. తాము వ్యవస్థలను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు. పాలకులు అసమర్థులు అయితే ప్రజలు నష్టపోతారని, ఏపీలో ప్రస్తుతం అదే జరుగుతోందని విమర్శించారు. ‘కరోనా’, లాక్ డౌన్ ల నేపథ్యంలో రాష్ట్రాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో నిన్న ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ గురించిన ప్రస్తావిస్తూ చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.