Kerala: ఆదాయం తగ్గింది.. మద్యంపై ట్యాక్స్ పెంచాం: కేరళ ప్రభుత్వం
- బీరు, వైన్ పై 10 శాతం అమ్మకం పన్ను పెంపు
- ఇతర మద్యం రకాలపై 35 శాతం పెంపు
- లాక్ డౌన్ కారణంగా కీలక ఆదాయాలు కోల్పోయామన్న ప్రభుత్వం
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో ఏకంగా 75 శాతం పెరిగాయి. కేరళ ప్రభుత్వం కూడా మద్యం ధరలను పెంచింది. బీరు, వైన్ పై 10 శాతం అమ్మకం పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర మద్యం రకాలపై 35 శాతం పన్నును పెంచింది. లాక్ డౌన్ కారణంగా కీలకమైన ఆదాయ వనరులన్నింటిపై ప్రభావం పడిందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా ఒక మార్గంగా మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.
మరోవైపు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డుల్లో ఖర్చులను తగ్గించుకోవాలని కూడా కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి అవసరమైన ప్రతిపాదనలు చేసేందుకు ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి రూ. 3,434 కోట్ల సాయాన్ని అందించాలనే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.