Congress: పెంచిన విద్యుత్ ధరలను వెంటనే తగ్గించండి: ఏపీ కాంగ్రెస్ దీక్ష
- విద్యుత్ శ్లాబులు మార్చి దొంగదెబ్బ తీశారు
- వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు
- ధరలను తగ్గించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరిగిన సంగతి తెలిసిందే. విద్యుత్ శ్లాబుల్లో మార్పులు చేయడం... సామాన్యుడి పాలిట పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్బంగా పార్టీ నేతలు మాట్లాడుతూ, విద్యుత్ శ్లాబులు మార్చి ప్రభుత్వం దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని విమర్శించారు. పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, గుంటూరు జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.