Speak: మాట్లాడితే ఎన్ని తుంపర్లు బయటకు వస్తాయి? ఎంత సేపు వైరస్ ఉంటుంది?... ప్రయోగ ఫలితాలివి!
- పెన్సిల్వేనియా శాస్త్రవేత్తల ప్రయోగం
- బయటకు వస్తున్న 1000కి పైగా తుంపరలు
- 8 నిమిషాల పాటు గాల్లోనే ఉంటాయని వెల్లడి
కరోనా బారిన పడకుండా ఉండటానికి భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు, మాస్క్ ల అవసరాన్ని నొక్కి చెప్పేలా పెన్సిల్వేనియాలోని ఓ యూనివర్శిటీ సైంటిస్టులు చేసిన ప్రయోగ ఫలితాలు వెల్లడయ్యాయి. విశ్వవిద్యాలయంలోని 'ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజ్' ఆధ్వర్యంలో మనుషులు మాట్లాడినప్పుడు, వెలువడే తుంపర్లపై పరిశోధనలు జరిపింది. ఎన్ని తుంపర్లు బయటకు వస్తాయి? అవి ఎంతసేపు గాల్లో ఉంటాయన్న విషయాన్ని వీరు పరిశీలించారు.
'ది ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్ ప్రచురించిన వివరాల ప్రకారం, గట్టిగా మాట్లాడేటప్పుడు ప్రతి క్షణం వేలకొద్దీ తుంపర్లు బయటకు వస్తుంటాయి. ప్రత్యేక లేజర్ సాయంతో వీటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని వైరస్ లు ఈ తుంపర్ల ద్వారా బయటకు వచ్చి, దాదాపు 8 నిమిషాల పాటు గాల్లోనే ఉంటున్నాయని కూడా వీరు గుర్తించారు. దీంతో వైరస్ చిన్న చిన్న తుంపరల నుంచి కూడా వ్యాప్తి చెందుతోందని నిర్ధారించారు. గట్టిగా మాట్లాడేటప్పుడు ఆ క్షణంలో సుమారు 1000కి పైగా తుంపరలు వైరస్ ను నింపుకుని బయటకు వస్తున్నాయని వీరు తేల్చారు.
కాగా, గాలి తక్కువగా ఉండే హాస్పిటల్స్, ఇళ్లు, క్రూయిజ్ షిప్ లు తదితరాలు కరోనా కేంద్రాలుగా ఎందుకు మారుతున్నాయనడానికి ఈ పరిశోధనలు వెలువరించిన సమాచారం మరింతగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.