Zoom App: జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్లో బైబిల్ క్లాసులు... అశ్లీల వీడియోలతో రెచ్చిపోయిన హ్యాకర్!
- అమెరికాలో ఘటన
- కాలిఫోర్నియాలో చర్చిలో ఆన్ లైన్ బైబిల్ అధ్యయనం
- క్లాసు మధ్యలో అశ్లీల వీడియోలు ప్రసారం
- బెంబేలెత్తిన భక్తులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలో అధికభాగం లాక్ డౌన్ లో మగ్గుతోంది. ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడమే కాదు, ఆన్ లైన్ కార్యకలాపాలు మరింత విస్తృతం అయ్యాయి. ఈ నేపథ్యంలో జూమ్ యాప్ ఉపయుక్తంగా మారింది. ఈ వీడియో కాలింగ్ యాప్ ద్వారా కార్యకలాపాలు సమన్వయం చేసేందుకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు కూడా మొగ్గుచూపుతుండడం అధికమైంది. అయితే ఈ యాప్ లో భద్రతాపరమైన లోపాలున్నాయని ఇప్పటికే భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఆ లోపాలు నిజమేనని నిరూపిస్తూ ఓ హ్యాకర్ రెచ్చిపోయాడు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చర్చిలో లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్లో బైబిల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అందుకోసం చర్చి యాజమాన్యం జూమ్ యాప్ ను వినియోగిస్తోంది. కానీ మే 6న ఇలాగే జూమ్ యాప్ ద్వారా బైబిల్ తరగతులు బోధిస్తుండగా, మధ్యలో ఓ హ్యాకర్ చొరబడి అశ్లీల వీడియోలు ప్రసారం చేశాడు. అప్పటివరకు భక్తితో బైబిల్ అధ్యయనం చేస్తున్న వారు ఈ ఉత్పాతానికి హడలిపోయారు.
బైబిల్ అధ్యయనంలో పాల్గొంటున్న వారిలో అత్యధికులు వృద్ధులేనని, వారిని ఈ వీడియోలు తీవ్రంగా బాధించాయని చర్చి వర్గాలు వెల్లడించాయి. దీనిపై జూమ్ యాజమాన్యానికి కూడా సదరు చర్చి ఫిర్యాదు చేసింది. ఆ హ్యాకర్ గురించి తమకు గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయని జూమ్ పేర్కొంది. అంతకుమించి స్పందించకపోవడంతో చర్చి యాజమాన్యం జూమ్ పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.