Leopard: చిక్కని చిరుత.. బిక్కుబిక్కుమంటున్న శివారు కాలనీలు
- గురువారం కాటేదాన్ రోడ్డుపై కనిపించిన చిరుత
- రాజేంద్రనగర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లి వుంటుందని అంచనా
- బోనులు ఏర్పాటు చేసిన అధికారులు
హైదరాబాద్ శివారు కాటేదాన్‌లో రోడ్డుపై కనిపించి, పట్టుకునే క్రమంలో మాయమైన చిరుత ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. దానిని బంధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో శివారు ప్రాంతాలు భయంతో వణుకుతున్నాయి. గురువారం కనిపించిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ లారీ క్లీనర్‌పై దాడిచేసి రోడ్డు పక్కన ఉన్న ఫాంహౌస్‌లోకి దూరింది. అక్కడి నుంచి అది కాలువ మార్గం ద్వారా బయటికి వెళ్లి ఉంటుందని దాని కాలి ముద్రల ద్వారా అధికారులు గుర్తించారు.
చిరుత పాదముద్రల ప్రకారం అది మైలార్దేవుపల్లి మీదుగా రాజేంద్రనగర్ వర్సిటీ పరిసరాల్లోని అటవీ ప్రాంతానికి, అక్కడి నుంచి చిలుకూరు అటవీప్రాంతంలోకి వెళ్లి ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అది వెళ్లినట్టుగా భావిస్తున్న ప్రాంతాల్లో దానికి ఆహారంగా మారిన జంతువుల కళేబరాలను అధికారులు గుర్తించారు. దీంతో అది ఆహారం కోసం మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని భావించి బోనులు ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత జాడలు కనిపిస్తే సమాచారం అందించాలని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి కోరారు.