Gujarat: కరోనాతో వణికిపోతున్న గుజరాత్.. ఇప్పుడు మూడో స్థానంలో!
- తబ్లిగీల కారణంగా గుజరాత్లో పెరిగిపోయిన కేసులు
- 334 మంది సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు
- హాట్‌స్పాట్‌గా అహ్మదాబాద్
కరోనా మహమ్మారి ఇప్పుడు గుజరాత్‌ను పట్టిపీడిస్తోంది. వైరస్ ఉద్ధృతి కొనసాగిన తొలి రోజుల్లో రాష్ట్రంలో ఆ ఊసే లేదు. కానీ రెండు నెలలు గడిచేసరికి కేసుల్లో ఏకంగా దేశంలోనే రెండో స్థానానికి, ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకోవడాన్ని బట్టి చూస్తుంటే వైరస్ అక్కడ ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా విజృంభించడానికి కారణం తబ్లిగీలే. ఢిల్లీ సమావేశం తర్వాత రాష్ట్రానికి చేరుకున్న తబ్లిగీల కారణంగా వైరస్ వేగంగా వ్యాప్తించింది.
పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న 126 మంది తబ్లిగీలను పోలీసులు అరెస్ట్ చేసి ఆసుపత్రులకు తరలించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన వారినీ గుర్తించారు. అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావ్‌నగర్, భుజ్ తదితర పట్టణాల్లోనూ కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాతి నుంచి క్రమంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా బారినపడి చనిపోయిన వారిలో కాంగ్రెస్ మునిసిపల్ కౌన్సిలర్ బద్రుద్దీన్ షేక్, కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో నేత హబీబ్ మెవ్ లాంటి వారు కూడా ఉన్నారు.
అహ్మదాబాద్‌లో ఇప్పటి వరకు 334 మంది సూపర్ స్ప్రెడర్లను అధికారులు గుర్తించారు. వీరిలో కూరగాయల వ్యాపారుల నుంచి చెత్త సేకరణ కార్మికుల వరకు ఉన్నారు. వృత్తిపరంగా వీరు ఇతరులను కలవాల్సి ఉండడంతో వారి ద్వారా వైరస్ ఇతరులకు సంక్రమిస్తున్నట్టు గుర్తించిన అధికారులు నిన్నటి వరకు నగరంలోని అన్ని దుకాణాలను మూసివేశారు. అయితే, నగరంలో సూపర్ స్ప్రెడర్ల సంఖ్య 14 వేల వరకు ఉందని భావిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.
వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఇక్కడ పెరుగుతోంది. ఇప్పటి వరకు 3,753 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జాతీయ స్థాయి రికవరీ రేటు ( 31.7 శాతం)తో పోలిస్తే గుజరాత్లో రికవరీ రేటు (36.5శాతం) ఎక్కువని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి జయంతి రవి తెలిపారు.
ప్రస్తుతం గుజరాత్ వేగంగా కోలుకుంటున్న నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. అలంగ్‌లోని షిప్ బ్రేకింగ్ యార్డులో నాలుగు ఓడలను విడగొట్టే పనులు మొదలయ్యాయి. సూరత్ సెజ్‌లో వజ్రాలు, రత్నాలకు సంబంధించిన 8 యూనిట్లలో కార్యకలాపాలు మొదలయ్యాయి.
నిన్నటి వరకు గుజరాత్ వ్యాప్తంగా 9,591 కేసులు నమోదు కాగా, వీటిలో 6,910 ఒక్క అహ్మదాబాద్‌లోనే నమోదు కావడం గమనార్హం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 586 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క అహ్మదాబాద్‌లోనే 465 మంది మృతి చెందారు.