Jabardasth: అప్పుడు నన్ను చంపడానికి కత్తులు తీసుకుని వచ్చారు: జబర్దస్త్ నవీన్
- డబ్బుల విషయంలో ఒకరు మోసం చేశారు
- అప్పు తీసుకుని నన్ను అడ్డం పెట్టుకున్నారు
- దీంతో అప్పు ఇచ్చిన వారు నన్ను చంపాలని చూశారు
- తప్పించుకుని పోలీసుల వద్దకు వెళ్లాను
గతంలో కొందరు తనను చంపడానికి ప్రయత్నించారని జబర్దస్త్ నటుడు నవీన్ తెలిపాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'గతంలో నేను జాబ్ చేస్తోన్న సమయంలో ఓ సారి నన్ను కొందరు చంపాలని చూశారు. వెంకటేశ్ అనే ఓ వ్యక్తి నాకు మంచి స్నేహితుడు. అతడి ఫ్రెండ్ ఒకరు నాకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అతడి ఫ్రెండ్ మల్లేశ్ అనే ఇంకొకరు నాకు ఫ్రెండ్ అయ్యాడు' అని తెలిపాడు.
'సికింద్రాబాద్‌లో మేము మాట్లాడుకునే వాళ్లం. మల్లేశ్ మంచోడేనని అనుకున్నాను. అతడితో మాట్లాడుతున్న సమయంలో తెలిసిన వారు ఒకరు నా వద్దకు వచ్చారు. తన బండిని తాకట్టు పెట్టించి డబ్బులు ఇప్పించాలని కోరాడు. మల్లేశ్ అందుకు సాయం చేస్తానని అన్నాడు. మా ఇద్దరిని ఒకరి వద్దకు తీసుకెళ్లాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికి తాను మళ్లీ వస్తానని చెప్పి మల్లేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, తాకట్టు కొట్టు యజమాని వద్ద మల్లేశ్ డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడని తెలుసుకుని షాక్ అయ్యాం. అతడికి ఎందుకు ఇచ్చావని అడిగాం. రూ.12 వేలు తీసుకెళ్లాడని ఆయన చెప్పాడు. దీంతో నేను ఆ డబ్బును ఆ వాహన యజమానికి ఇవ్వాల్సి వచ్చింది' అని తెలిపాడు.
'అనంతరం వెంకటేశ్‌తో కలిసి మల్లేశ్ ఇంటికి వెళ్లి నిలదీశాను. తాను డబ్బులు ఖర్చుచేశానని చెప్పాడు. దీంతో ఒకరి వద్ద అప్పు తీసుకుని నా డబ్బు నాకు ఇచ్చాడు. అయితే, మల్లేశ్‌కి వడ్డీకి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఆరు నెలల తర్వాత నాకు ఫోన్ చేసి డబ్బులు తిరిగి ఇవ్వాలని, వడ్డీ కట్టాలని అడిగాడు. డబ్బులు నేనెందుకు ఇస్తానని, ఎవరు తీసుకుంటే వారే ఇవ్వాల్సి ఉంటుందని, మల్లేశ్‌నే అడగాలని చెప్పాను.
'అయితే, నీ పేరు చెప్పే అతడు తీసుకున్నాడు. నువ్వే మా మధ్యలో ఉన్నావు, నువ్వే ఇవ్వాలని అడిగాడు. ఒక దగ్గరికి రమ్మన్నాడు. నేను వెళ్లాను. అయితే, ఆ ప్రాంతం నుంచి నన్ను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెళ్లనివ్వలేదు. ఓ హోటల్ వద్దే నిల్చోపెట్టారు. ఓ వ్యక్తి స్కూటర్లో కత్తులు తీసుకుని వచ్చాడు. నన్ను ఏదో చేయడానికి వచ్చారని అప్పుడు అర్థమైంది. వెంటనే నేను అక్కడి నుంచి తప్పించుకుని పోలీసుల వద్దకు వెళ్లాను. అప్పటి నుంచి నేను ఎవ్వరినీ నమ్మట్లేదు. ఈ డబ్బుల విషయంలో ఎవ్వరినీ నమ్మొద్దు' అని చెప్పాడు.