Rohit Sharma: టీమిండియాకు ఏ విధమైన మద్దతు దొరకని ప్రదేశం బంగ్లాదేశ్: రోహిత్ శర్మ
- లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన క్రికెటర్లు
- బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తో కలిసి రోహిత్ లైవ్
- బంగ్లాదేశ్ అభిమానులు చాలా విభిన్నమైనవాళ్లని వ్యాఖ్యలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్ లోకం కూడా ఇంటికే పరిమితమైంది. దాంతో ఆటగాళ్లు సోషల్ మీడియా లైవ్ ద్వారా అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తో ఫేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో టీమిండియాకు ఏ విధమైన మద్దతు లభించని ప్రదేశం ఏదైనా ఉందంటే అది బంగ్లాదేశ్ మాత్రమేనని స్పష్టం చేశాడు. అక్కడి మైదానాల్లో భారత జట్టును సపోర్ట్ చేయరని, ప్రేక్షకుల మద్దతు మొత్తం ఆతిథ్య జట్టుకే లభించేదని వివరించాడు.
"భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో క్రికెట్ అభిమానులు ఆట పట్ల ఎంతో అనురక్తితో ఉంటారు. మేం ఏదైనా తప్పు చేస్తే నలుమూలల నుంచి విమర్శలు చేస్తారు. బంగ్లాదేశ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలుసు. అయితే, మేం ఏ దేశానికి వెళ్లినా అక్కడి వాళ్లు కూడా మమ్మల్ని ప్రోత్సహించేవాళ్లు. బంగ్లాదేశ్ లో అందుకు పూర్తి భిన్నం. బంగ్లాదేశ్ లో ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే... నమ్మశక్యం కాని రీతిలో ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు ఇచ్చేవాళ్లు కాదు. మేం ప్రేక్షకుల మద్దతు లేకుండానే మ్యాచ్ లు ఆడాల్సి వచ్చేది" అని రోహిత్ శర్మ వివరించాడు.