Jagan: వలస కూలీలు నడుచుకుంటూ వెళుతూ ఎక్కడ కనిపించినా రాష్ట్ర సరిహద్దుల వరకు బస్సుల్లో పంపండి: సీఎం జగన్ ఆదేశాలు
- లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులకు కష్టాలు
- స్వస్థలాలకు నడిచి వెళుతున్న వైనం
- ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలంటూ సీఎం జగన్ ఆదేశాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ దేశంలోని లక్షల మంది వలస కార్మికులను తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. ఉన్నచోట తిండి లేక, స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేక వారి బాధలు వర్ణనాతీతం. అందుకే చాలామంది వలస కార్మికులు కాలినడకనే ప్రమాదకర రీతిలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏ రాష్ట్రంలోని రహదారులపై చూసినా నడుచుకుంటూనో, సైకిళ్లపై ప్రయాణిస్తూనో వలస కార్మికుల కుటుంబాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో తమ సొంత రాష్ట్రాలకు నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ గుండా నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులు ఎక్కడ కనిపించినా సరే, వారిని బస్సుల్లో ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వలస కార్మికులు, కూలీల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, తాగునీరు, భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారికి 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.