Kidnap: కిడ్నాపైన బాలుడిని రక్షించిన హైదరాబాద్ పోలీసులు... కరోనా పాజిటివ్ రావడంతో మీడియా వారు సహా అందరూ క్వారంటైన్!

Police Rescued Kidnapped Toddler Tests corona Positive

  • ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న బాలుడి కిడ్నాప్
  • పిల్లల కోసం ఇబ్రహీం అనే వ్యక్తి నేరం
  • కనిపెట్టిన తరువాత వైద్య పరీక్షల్లో పాజిటివ్

ఏడాదిన్నర బాలుడు కిడ్నాప్ కాగా, రంగంలోకి దిగిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీటీవీ కెమెరాల సహకారంతో నిందితుడిని గుర్తించి, బాలుడిని కాపాడారు. ఆపై చేసిన వైద్య పరీక్షల్లో బాలుడికి కరోనా సోకినట్టు తేలడంతో బాలుడితో కాంటాక్ట్ అయిన పోలీసులు, న్యూస్ కవర్ చేసిన మీడియా వాళ్లందరినీ క్వారంటైన్ చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఫుట్ పాత్ పై తాను నిద్రపోతుంటే, తన బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారని బుధవారం నాడు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు, బిడ్డను ఇబ్రహీం అనే వ్యక్తి ఎత్తుకుని వెళ్లినట్టు గుర్తించారు. తన మగబిడ్డలంతా అనారోగ్యానికి గురై చనిపోవడంతో, ఓ అబ్బాయి కావాలని భావించిన ఇబ్రహీం, ఈ పని చేశాడు. అతన్ని అరెస్ట్ చేసిన తరువాత బాలుడి తల్లి, ఇబ్రహీం కుటుంబీకులు, పోలీసులు, జర్నలిస్టులను క్వారంటైన్ చేశారు.

కాగా, పిల్లాడి ఆలనా పాలనా చూసుకునే స్థితిలో ఆ తల్లి లేకపోవడంతో చైల్డ్ వెల్ ఫేర్ కేంద్రానికి అప్పగించారు. ఆమె మద్యం తాగి కాలం వెళ్లబుచ్చుతూ ఉంటుందని పోలీసులు తెలిపారు. బిడ్డ కిడ్నాప్ అయిన రోజు కూడా ఆమె తప్పతాగి ఒళ్లు తెలియకుండా నిద్రపోయిందన్నారు. మొత్తం 22 మందిని క్వారంటైన్ చేశామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News