obama: కరోనా విజృంభణ నేపథ్యంలో ట్రంప్‌పై ఒబామా కీలక వ్యాఖ్యలు
- మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా విఫలం
- నల్ల జాతీయులపట్ల వివక్ష కొనసాగుతోంది
- కరోనా ప్రజల జీవితాలను సర్వ నాశనం చేసింది
- కొందరు కనీసం తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు కూడా నటించడంలేదు
అమెరికాలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా మాట్లాడుతూ... కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
కరోనా విపత్తు సమయంలోనూ తమ దేశంలో నల్ల జాతీయులపట్ల వివక్ష కొనసాగుతోందని ఆయన తెలిపారు. వారు కొన్నేళ్లుగా ఇక్కడ వివక్షకు గురవుతూనే ఉన్నారని ఆయన చెప్పారు. కొందరు బయటకు వెళ్లిన సందర్భాల్లో హత్యలకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. కరోనాతో అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. కరోనా ప్రజల జీవితాలను సర్వ నాశనం చేసిందని ఆయన చెప్పారు. పరిస్థితులన్నీ తలకిందులయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు కనీసం తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు కూడా నటించడంలేదని ఒబామా అనడం గమనార్హం. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. 90 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 47 లక్షలు దాటింది.