VH: వీహెచ్ తో దీక్ష విరమింపజేసిన ఉత్తమ్, భట్టి
- వలస కార్మికుల సమస్యలపై వీహెచ్ దీక్ష
- వీహెచ్ ను అభినందించిన ఉత్తమ్
- దేశ విభజన కంటే ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యలు
వలస కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు గాంధీభవన్ లో ఈ ఉదయం నుంచి నిరసన దీక్ష చేపట్టారు. వీహెచ్ దీక్షను ఈ సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విరమింపజేశారు. వలస కార్మికుల సమస్యలపై ఎలుగెత్తిన వీహెచ్ ను అభినందిస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ తెలిపారు.
దేశ విభజన సమయంలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, వీహెచ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కేవలం మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ వలస కార్మికుల పట్ల సరైన విధానం ఎంచుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. వలస కార్మికులకు న్యాయం జరగకపోతే తాను ఆమరణ దీక్షకైనా సిద్ధమేనని వీహెచ్ స్పష్టం చేశారు.