England: జులైలో ఇంగ్లండ్‌లో టెస్టు, టీ20 సిరీస్.. ఓకే చెప్పిన పాకిస్థాన్ బోర్డు!
- ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌ను తిరిగి ప్రారంభించడం ఎంతో ముఖ్యం
- మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడబోతున్నాం
- ఆటగాళ్లపై ఒత్తిడి ఉండదు: పీసీబీ సీఈవో వసీం ఖాన్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంగ్లండ్‌తో టెస్టు, టీ20 సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులైలో ఈ సిరీస్‌ను నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ ఆటగాళ్లపై ఎటువంటి బలవంతం ఉండబోదని ఇరు దేశాల బోర్డులు చెబుతున్నాయి.
ఇంగ్లండ్ టూర్ విషయంలో ఓ అంగీకారానికి వచ్చామని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జులైలో పాక్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుందని పీసీబీ సీఈవో వసీం ఖాన్ తెలిపారు. సిరీస్‌లో భాగంగా మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఆ దేశానికి తమ జట్టును పంపించేందుకు అంగీకరించినట్టు వివరించారు.
మూడు టెస్టుల్లో రెండింటిని మాంచెస్టర్, సౌతాంప్టన్‌లలో నిర్వహించాలని భావిస్తుండగా, మూడో వేదికపై స్పష్టత రాలేదు. ఆటగాళ్ల రక్షణకు సంబంధించిన అన్ని జాగ్రత్తలను సిరీస్ నిర్వహించే దేశమే (ఇంగ్లండ్) చూసుకుంటుందని వసీంఖాన్ తెలిపారు. అలాగే, సిరీస్ పూర్తయ్యేంత వరకు వైద్య బృందం జట్టుతోనే ఉంటుందన్నారు. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో క్రికెట్‌ను తిరిగి ప్రారంభించడం ఎంతో ముఖ్యమని వసీంఖాన్ అన్నారు.