Lockdown 4.0: లాక్ డౌన్ 4.0 నిబంధనలను రాష్ట్రాలు బలహీన పరచకూడదు: కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక
- లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలి
- కంటైన్మెంట్, బఫర్ జోన్లలో క్షేత్ర స్థాయిలో కార్యాచరణను పెంచాలి
- కంటైన్మెంట్ జోన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండాలి
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ లో కొన్ని ఆంక్షలను కొంత మేర సడలించినప్పటికీ... కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం తెలిపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని స్పష్టమైన సూచనలను ఇచ్చింది. లాక్ డౌన్ మార్గదర్శకాలను బలహీనపరిచే విధంగా వ్యవహరించరాదని ఆదేశించింది. అవసరమైతే ఆంక్షలను కఠినతరం చేసుకోవచ్చని... ఇతర యాక్టివిటీలపై నిషేధాన్ని విధించుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, యూటీలకు లేఖలు రాశారు.
కొత్త గైడ్ లైన్స్ ను కఠినంగా అమలు చేయాలని లేఖలో భల్లా సూచించారు. 'కొత్త గైడ్ లైన్స్ ప్రకారం కరోనా విస్తరిస్తున్న విధానాన్ని బట్టి రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లను రాష్ట్రాలు విభజించాలి. రెడ్ జోన్లు, కరోనా ఎక్కువగా వున్న ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లను జిల్లాల వారీగా గుర్తించాలి. కంటైన్మెంట్, బఫర్ జోన్లలో క్షేత్ర స్థాయిలో కార్యాచరణను పెంచాలి' అని పేర్కొన్నారు.
ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతాన్ని 28 రోజుల పాటు కంటైన్మెంట్ లో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండాలని... అత్యవసర వైద్యం, అత్యవసర వస్తువులు, సేవలు మినహా ఇతర రాకపోకలు ఉండకూడదని తెలిపింది. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ను కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే.