Maharashtra: అబ్బే.. కుదరదు.. నిబంధనలను ఇప్పుడు సడలించలేం: ఉద్ధవ్ థాకరే
- వైరస్ గొలుసును తెంపలేకపోతున్నాం
- గ్రీన్ జోన్లలో ఉన్న వారు బయటకు రావాలి
- ఆత్మనిర్భర్ భారత్‌కు మీ సేవలు అవసరం
మహారాష్ట్రను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. అత్యధిక కేసులు, మరణాలతో దేశంలోనే ఈ రాష్ట్రం ముందుంది. రోజూ వందల సంఖ్యలో ఇక్కడ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తేల్చి చెప్పారు.
లాక్‌డౌన్ వల్ల వైరస్‌ను నియంత్రించగలిగినా.. దాని గొలుసును విడగొట్టలేకపోతున్నామని అన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఉద్ధవ్ తెలిపారు. ఇందులో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు. నిబంధనల సడలింపు అంశాన్ని కేంద్రం.. రాష్ట్రాలకే వదిలేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
వలస కూలీలు స్వగ్రామానికి వెళ్లిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు స్థానికులు బయటకు రావాలని ఉద్ధవ్ కోరారు. గ్రీన్‌జోన్‌లో ఉన్నవారు దయచేసి బయటకు రావాలని, పరిశ్రమల్లో మానవ వనరుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి.. ప్రధాని మోదీ భాషలో అభ్యర్థిస్తున్నానని, ఆత్మనిర్భర్ భారత్ కావాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, లాక్‌డౌన్ నాలుగో విడతలోనూ పాత నిబంధనలే అమల్లో ఉంటాయని, అనుమతి లేకుండా తిరిగే వాహనాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.