Shoaib Akhtar: ఆ మ్యాచ్ లో సచిన్ ను అవుట్ చేసిన తర్వాత ఎంతో బాధపడ్డాను: షోయబ్ అక్తర్
- 2003 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- 98 రన్స్ చేసిన సచిన్
- అక్తర్ బౌలింగ్ లో అవుట్
- మ్యాచ్ లో గెలిచిన భారత్
భారత్ లో బ్యాటింగ్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ ను అవుట్ చేశారంటే ఏ బౌలర్ కైనా పండగే! మ్యాచ్ ఏ దశలో ఉన్నప్పుడైనా సచిన్ అవుటయ్యాడంటే ప్రత్యర్థి జట్టులో భారీ సంబరాలు చేసుకుంటారు. అయితే, 2003 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా, సచిన్ విశ్వరూపం ప్రదర్శించి 98 పరుగులు చేశాడు. సెంచరీకి రెండు పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఆ మ్యాచ్ లో సచిన్ ను అవుట్ చేసింది ఎవరో కాదు, భీకరమైన వేగానికి ప్రతిరూపంలా నిలిచే షోయబ్ అక్తర్.
అయితే, నాడు సచిన్ ను అవుట్ చేసిన తర్వాత సంతోషం కలగలేదని, ఎంతో బాధపడ్డానని అక్తర్ తాజాగా వెల్లడించాడు. సెంచరీకి చేరువైన సచిన్ ను అవుట్ చేయడం వ్యక్తిగతంగా తనకు ఎంతో వేదన కలిగించిందని అన్నాడు. వరల్డ్ కప్ మ్యాచ్ లో సెంచరీ చేయడం అనేది ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని, కానీ సచిన్ కు ప్రత్యేక ఇన్నింగ్స్ ను తానే దూరం చేశానని, సచిన్ సెంచరీ పూర్తిచేయాలని కోరుకున్నానని అక్తర్ వివరించాడు. ఓ బౌన్సర్ విసిరి సచిన్ వికెట్ చేజిక్కించుకున్నానని, కానీ ఆ బంతికి సచిన్ సిక్సర్ కొడితే ఎంతో సంతోషించేవాడ్నని నాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆ వరల్డ్ కప్ లో జరిగిన పోరులో తొలుత పాకిస్థాన్ 7 వికెట్లకు 273 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సచిన్ విధ్వంసక ఆటతీరుతో పాకిస్థాన్ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. 75 బంతుల్లోనే 98 పరుగులు చేసి భారత్ విజయానికి సరైన పునాది వేశాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ రాణించడంతో భారత్ మరో 4.2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.