EU: డబ్ల్యూహెచ్ఓను తప్పుబట్టేందుకు ఇది సమయం కాదు.. అమెరికాకు యూరోపియన్ యూనియన్ హితవు
- డబ్ల్యూహెచ్ఓపై నిప్పులు చెరుగుతున్న ట్రంప్
- కరోనా వ్యాప్తిపై తగిన విధంగా అప్రమత్తం చేయలేదని ఆగ్రహం
- ఒకరిని బాధ్యుల్ని చేయడం తగదన్న ఈయూ
కరోనా వైరస్ వ్యాప్తిపై అంతర్జాతీయ సమాజాన్ని తగు రీతిలో అప్రమత్తం చేయలేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యవహార శైలి మార్చుకోకపోతే నిధుల మంజూరును శాశ్వత ప్రాతిపదికన నిలిపివేస్తామని, అవసరం అయితే అసలు సభ్యత్వాన్నే వదులుకుంటామనీ కూడా హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు సరికాదని ఈయూ అభిప్రాయపడింది. అయినా ఇలాంటి వ్యాఖ్యలకు ఇది తగిన సమయం కాదని స్పష్టం చేసింది. అన్ని దేశాలు బాధపడుతున్న పరిస్థితుల్లో ప్రత్యేకించి ఒకరిని బాధ్యులుగా పేర్కొనడం సబబు కాదని హితవు పలికింది. కరోనా ఎలా వ్యాపించిందన్న అంశంలో స్వతంత్ర అధ్యయనం అవసరమన్నదే తమ వైఖరి అని ఈయూ స్పష్టం చేసింది.