Sonia Gandhi: మే 22న విపక్షాల సమావేశానికి పిలుపునిచ్చిన సోనియా గాంధీ
- కరోనా సంక్షోభంపై చర్చ
- వలస కార్మికుల సమస్యలపై పార్టీల అభిప్రాయం కోరనున్న సోనియా
- 20 పార్టీల నేతలకు ఆహ్వానం
దేశంలో కరోనా సంక్షోభంపై చర్చించేందుకు మే 22న విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వలస కార్మికుల పరిస్థితిపైనా చర్చించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ సంక్షోభంతో తలెత్తిన సమస్యలు, సొంత రాష్ట్రాలకు తరలివెళ్లడంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులపై సోనియా ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేఎంఎం అగ్రనేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, ఆర్జేడీ పార్టీ నేత తేజస్వి యాదవ్ తదితరులను ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 20 పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.