Talasani: అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం: సినీ ప్రముఖులతో భేటీ తర్వాత మంత్రి తలసాని
- షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై చర్చించాం
- షూటింగుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేశాం
- సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధం
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమావేశమై కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. షూటింగులు, సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించే అంశాలపై చిరంజీవి, అల్లు అరవింద్, దిల్ రాజు, సి.కల్యాణ్, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, కొరటాల శివతో పాటు పలువురితో తలసాని చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అందరి అభిప్రాయాలు తీసుకుని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకు వెళ్తామని తెలిపారు. షూటింగుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని చెప్పారు. సినిమాల చిత్రీకరణపై ప్రాధాన్యతలు గుర్తించాలని, వాటిపై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో చిరంజీవి కమిటీ ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు. మొత్తం 14 వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.