Donald Trump: కరోనా విజృంభణ వేళ.. చైనాపై మరోసారి మండిపడ్డ ట్రంప్
- కరోనా విషయంలో చైనా చాలా తెలివితక్కువగా సమర్థించుకుంటోంది
- కరోనా గురించి తప్పుడు సమాచారం ఇస్తోంది
- తప్పుడు ప్రచారం అవమానకరంగా ఉంది
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా విషయంలో చైనా చాలా తెలివితక్కువగా తన దేశాన్ని సమర్థించుకుంటోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతున్న కరోనా గురించి తప్పుడు సమాచారం ఇస్తూ ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు.
తమ దేశంతో పాటు ఐరోపా దేశాలపై చైనా చేస్తున్న తప్పుడు ప్రచారం అవమానకరంగా ఉందని ఆయన వాపోయారు. ఇతర దేశాలకు వైరస్ వ్యాపించకుండా సులభంగానే ఆపేసే అవకాశం చైనాకు ఉండేదని, కానీ వారు అలా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ గెలవాలనే ఉద్దేశంతో చైనా తప్పుడు సమాచార వ్యాప్తి చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా రాకముందు వరకు కొనసాగిన దోపిడిని, మళ్లీ కొనసాగించడానికి వీలుగా బిడెన్ గెలవాలని చైనా కోరుకుంటోందని చెప్పారు.