Amphan: ఎంఫాన్ తుపాను ప్రభావంతో రంగులు మార్చుకున్న ఆకాశం!
- భువనేశ్వర్ లో వర్ణభరితమైన ఆకాశం
- కాస్త గులాబీ వర్ణం, ఎక్కువగా ఊదా రంగుతో కనిపించిన నింగి
- ఎంఫాన్ దాటిపోయిన తర్వాత భువనేశ్వర్ లో అరుదైన దృశ్యం
గత కొన్నేళ్లలో ఇంతటి భారీ తుపాను ఎన్నడూ రాలేదని అందరూ పేర్కొంటున్న ఎంఫాన్ తుపాను నిన్న బెంగాల్ లో దిఘా, బంగ్లాదేశ్ లోని హతియా మధ్య తీరం దాటిన సంగతి తెలిసిందే. ఇది బెంగాల్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 6 గంటల పాటు మహోత్పాతం సృష్టించింది. అటు, ఒడిశా ఉత్తర ప్రాంతంపైనా పంజా విసిరిన ఎంఫాన్ దక్షిణభాగాన్ని మాత్రం కాస్త కనికరించింది.
అయితే, ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఎంఫాన్ తుపాను ప్రభావం సందర్భంగా ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. తుపాను దాటిపోయిన తర్వాత భువనేశ్వర్ లో ఆకాశం రంగులు మార్చుకుంది. కొంచెం గులాబీ రంగు, ఎక్కువశాతం ఊదా రంగు పులుముకున్న ఆకాశం తుపాను ప్రభావానికి సాక్షిగా నిలిచింది. ఈ వర్ణభరిత దృశ్యం కొన్ని నిమిషాల పాటు భువనేశ్వర్ వాసులకు కనువిందు చేసింది.