Pakistan: పాకిస్థాన్ ఘోర విమాన ప్రమాదంపై మోదీ, ఇమ్రాన్ ఖాన్ స్పందన
- కరాచీ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిన విమానం
- విమానంలో 91 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది క్రూ సభ్యులు
- ఎంతో బాధగా ఉందన్న మోదీ
పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ఒక్క నిమిషం ముందు పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం క్రాష్ అయింది. ప్రమాద సమయంలో 91 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది క్రూ సిబ్బంది విమానంలో ఉన్నారు. ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ... మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'పాకిస్థాన్ విమాన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధిస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ క్రాష్ తో షాక్ కు గురయ్యానని చెప్పారు. పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ సీఈవోతో టచ్ లో ఉన్నానని... సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బందితో కూడా మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించామని తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నానని చెప్పారు.