Nizamabad: కరోనా ఎఫెక్ట్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మళ్లీ వాయిదా
- మే 7న జరగాల్సిన ఉపఎన్నిక ఇప్పటికే ఓసారి వాయిదా
- తాజాగా మరోసారి వాయిదా వేసిన ఈసీ
- ఈసారి 45 రోజుల పొడిగింపు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మే 7న జరగాల్సిన ఉపఎన్నిక ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, లాక్ డౌన్ ఇప్పట్లో తొలగిపోయే పరిస్థితులు లేకపోవడంతో ఉపఎన్నికను మళ్లీ వాయిదా వేశారు. గతంలో పొడిగించిన గడువు ముగుస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి 45 రోజులకు పొడిగించింది.
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక రావడంతో మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేశారు. మే 7న ఎన్నికలు జరుగుతాయంటూ షెడ్యూల్ లో పేర్కొన్నారు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు.
నిజామాబాద్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ నాటి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు ఫిర్యాదు చేయగా, ఆయన భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా, ఈ స్థానం నుంచి ఈసారి టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.