Telangana: హైదరాబాద్‌లో కరోనా బారిన పడిన సీఐ, ఎస్సై,కానిస్టేబుల్!
- వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపడంలో సీఐ కీలక పాత్ర
- 30 మంది నుంచి నమూనాల సేకరణ
- పోలీసుల కుటుంబాలు గాంధీకి తరలింపు
తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తుండగా మరోవైపు, కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా ఒక్కొక్కరుగా కరోనా రోగులుగా మారుతుండడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా పరీక్షలు నిర్వహించడంతో కోవిడ్ సోకినట్టు తేలింది. దీంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను సొంత రాష్ట్రానికి పంపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కంటైన్‌మెంట్ జోన్లలోనూ ఆయన విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఎక్కడో ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు.
సీఐకి కరోనా సోకిందన్న విషయం తెలియగానే అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు కలిపి మొత్తం 30 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో కొందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అలాగే, గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన ఎస్సై, కానిస్టేబుల్‌కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా సోకిన పోలీసుల కుటుంబాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు, పోలీసులు కరోనా బారినపడుతుండడంతో ఆ శాఖలో కలకలం రేగింది. చాలామంది పోలీసులు లాంగ్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.